Jeevana Vaividhyam

https://www.udemy.com/mastering-qlikview-set-analysis/learn/v4/overview

జీవన వైవిధ్యం
ర్మ, భక్తి, ధ్యానం- ఇవి వేరువేరు విషయాలుగా కనిపిస్తాయి. ఒక్కోసారి, పరస్పర వ్యతిరేకంగానూ అనిపిస్తాయి. కర్మలు అంటే, అర్థరహితమైన పనులు కావు. కాబట్టి, నిత్యం ధ్యానం చేసేవారు సైతం కర్మలు చేస్తుంటారు. అవి చిత్తమాలిన్యాన్ని తొలగిస్తాయి.

దేవతా స్వరూపాలు ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. చంద్రశేఖరుడైన శివుడే గరళ కంఠుడు కూడా! పరమ శాంతమూర్తి అయిన ఆ ఈశ్వరుడే సందర్భాన్ని బట్టి ప్రళయకాల రుద్రుడవుతాడు. గణపతి ముఖం ఏనుగు రూపమైతే, దేహం మానవ రూపానిది. ఆ లంబోదరుడి భారీ శరీరాన్ని మోసేది ఓ చిట్టెలుక. ఎంత వింత? అయినా అవన్నీ స్వామికి సంపూర్ణంగా సరిపోయాయి. ఆయనను భక్తులు పరబ్రహ్మంగా ఆరాధిస్తారు.

ఈ ప్రకృతిలో పరమ వైవిధ్య విషయాలు అనేకం ఉన్నాయి. ఒక పక్క ఆకాశాన్నంటే మహోన్నత పర్వత శిఖరాలు, వాటి పక్కనే పాతాళంలాంటి అగాధమైన లోయలు. ఒక పక్క జలనిధులైన నదీనదాలు. ఇంకో వైపు చుక్క నీటికైనా నోచుకోని ఎడారులు. వాటితో జీవనయాత్ర సాగించడమే మనిషి పని.

దారి దోపిడులతో బతికే వ్యక్తి, ఆ తరవాత పరమ పవిత్ర కావ్యాన్ని రచించడం- ఎంత వైవిధ్యం! దొంగగా అతడు మహర్షులనే అడ్డగించి, దోచుకోవాలనుకున్నాడు. నిజం గ్రహించి వారి కాళ్లమీద పడ్డాడు. వారు ఉపదేశించిన ‘రామ’ మంత్రాన్ని భక్తితో ధ్యానించి, ఒక మహర్షిగా మారాడు. మహర్షి వాల్మీకిగా ఆయన రచించిన రామాయణమే, మానవాళికి సన్మార్గం చూపే ఇతిహాసంగా యుగయుగాలుగా విలసిల్లుతోంది.

కామం, క్రోధం, ద్వేషం, రాగం- పాపకార్యాలకు దారితీస్తుంటాయి. దూషణ, హింస, చౌర్యం కూడా పాపాలే! స్పృహ లేని స్థితిలో జరిగినవాటిని పాపాలుగా భావించరు. అలాగే- లోకానికి ఉపకారం చేయడం కోసం, శాంతంగా ఆలోచించి నిర్వహించే పనిని పాపంగా లెక్కించరు. శ్రీకృష్ణుడు గీతోపదేశాన్ని ముగిస్తూ ‘నిన్ను ఆవరించిన శోకం, మోహం తొలగిపోయాయా?’ అని అర్జునుణ్ని ప్రశ్నిస్తాడు. అందుకే- శోకం, మోహం లేకుండా చేసే యుద్ధాన్ని, దాని వల్ల జరిగే హింసను పాపంగా లెక్కించకూడదంటారు.

‘మనిషికి అమృత స్థితి కలగ లేదంటే దానికి కారణం కామ క్రోధాలే’ అంటుంది భగవద్గీత. ఇష్టానికి వ్యతిరేకం ‘అయిష్టం’. ఇష్టంవల్ల కామం కలుగుతుంది. అయిష్టం కారణంగా కోపం వస్తుంది. అదేవిధంగా, అయినవారి కష్టాలన్నీ తనవే అనుకొని శోకిస్తుంటాడు మనిషి. ‘శోకం లేకుండా మనిషి ఆనంద స్వరూపుడు కావడమే మోక్షం’ అన్నదే శంకరాచార్యుల బోధన సారాంశం! సద్గురువు ఉపదేశం ఎంతో పరివర్తన తెస్తుంది. అది మనిషిని అంధకారం నుంచి కాంతి వైపు నడిపించే దివ్య శక్తి.

ఒక జైనముని పాదాల్ని ఎందరో ఆశ్రయించి ధర్మదీక్ష పొందడాన్ని ఓ వేటగాడు గమనిస్తాడు. ‘స్వామీ! నాకూ దీక్ష ఇవ్వండి’ అని ప్రార్థిస్తాడు. ‘జంతువుల్ని హింసించే వేటగాడివి కదా… దీక్ష ఇవ్వడం కుదరదు’ అంటాడు ముని. ‘అది నా జీవిక’ అని బదులిస్తాడు వేటగాడు.

‘సరే! కనీసం ఏదో ఒక ప్రాణి పట్ల అహింసా వ్రతం ఆచరించు’ అని ముని సూచిస్తాడు. వేటగాడు అంగీకరిస్తాడు. అనంతరం ముని ధర్మదీక్ష ఇవ్వడంతో, అతడు కుందేళ్ల వేటకు స్వస్తి చెబుతాడు.

తరవాత ఆ వేటగాడికి వన్యప్రాణులపై జాలి కలుగుతుంది. జింకల వేట వదిలేస్తాడు. అనంతరం పక్షుల వేట మానుకుంటాడు. చివరకు అసలు ప్రాణిహింసనే అతడు త్యజిస్తాడు. తానే ఒక మునిగా మారిపోతాడు!

– డాక్టర్‌ పులిచెర్ల సాంబశివరావు
Advertisements

Ninna Nedu Repu

నిన్న-నేడు-రేపు

‘గడిచిన కాలం గురించి ఆలోచన అనవసరం’ అంటారు కొందరు. ‘సంతోషమో, విచారమో- ఆ గతానుభవం తిరిగిరాదు’ అంటారు మరికొందరు. భవిష్యత్తు అనేది ప్రస్తుతానికి వూహలోనే నిలిచి ఉంది. వూహలో మాత్రమే ఉంది. అన్నీ నిజమైన సుఖదుఃఖాల్ని కలిగించలేవు. అవి వస్తాయో రావో, వస్తే ఏ రూపంలో ఎలా ఉంటాయో ఎవరికీ తెలియదు. తెలియనివాటి గురించి సంబరపడటం లేదా కుంగిపోవడం సబబు కాదు. మనిషి యథార్థంగా పొందగలిగేది వర్తమాన క్షణంలో అనుభవానికి వచ్చే సుఖదుఃఖాలనే! మిగిలిన అనుభవాలన్నీ ‘అప్రస్తుతాలు’ అని పెద్దలు చెబుతారు.

వర్తమానంలో ఎదురైన దుఃఖాల నివృత్తి పైనే మనిషి దృష్టి కేంద్రీకరించాలి. ప్రస్తుతాన్ని ఉపేక్షించి, అప్రస్తుత విషయాలమీద విలువైన కాలాన్ని వెచ్చించడం వివేకం కాదు.

సుఖానుభవమంతా గతంలోనే ఉందని కొంతమంది భావిస్తారు. ఆ పాత అనుభవాల మననంతోనే కాలం గడుపుతారు. వారి దృష్టిలో- జీవితంలో రసం, సారం అంటూ ఏదైనా ఉంటే, అది గతంలో కలిగిన మధురానుభవాల నెమరువేతలోనే! వయసు పెరిగి అనారోగ్యం, వృద్ధాప్యం వంటి అనివార్యమైన వాటిని వర్తమానంలో ఎదుర్కొంటున్నవారి పరిస్థితి అది. ప్రస్తుత వాస్తవాల కంటే గతకాలపు జ్ఞాపకాలే వారికి ఎక్కువ సుఖదాయకంగా ఉంటాయి.

మారుతున్న విలువలతో సంఘర్షణ లేకుండా సాగిపోవడం అంత సులభమేమీ కాదు. లౌకిక సంబంధ బాంధవ్యాల నిర్వహణలో అలసినవారికి సమాజపు కొత్త విలువలతో సమాధానపడేందుకు ఓపిక చాలదు. ఆ దశలో వారికి ‘గత కాలము మేలు, వచ్చు కాలము కంటెన్‌’ అనిపించడం ఆశ్చర్యం కాదు. గత కాలపు సంగతుల మేలు తలచుకోవడంలోనే వారికి కాలం గడుస్తుంది.

ఎంత కష్టమైనా సుఖమైనా- ఒకసారి అనుభవానికి వచ్చిన తరవాత అది చెరకు పిప్పి వంటిదని కొందరంటారు. కాల్చేసిన టపాకాయలో, వెలిగి ఆరిన చిచ్చుబుడ్డిలో ఇక ఏదీ ఉండదని వారి అభిప్రాయం. గతాన్ని తలచుకోవడమే వ్యర్థం జీవితం అంటే; కొత్త బంగారు లోకమేనని, సుఖం కలిగించేలా భవిష్యత్తులో అనేకం తమకు కలగనున్నాయని వారు తలుస్తారు. ఆశగా ఎదురుచూస్తుంటారు. వారిలో ఎప్పుడూ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి గురించిన మధురమైన వూహలే నెలకొంటాయి.

భవిష్యత్తులో దుఃఖం తప్పదని సదా శంకించేవారికి ఆపదలు, అనర్థాలే కనిపిస్తుంటాయి. జరిగిన, జరుగుతున్న వాటి కంటే, జరగనున్నవే తమకు ఎక్కువ సుఖానుభూతి కలిగిస్తాయని వారు నమ్ముతుంటారు.

గతంలోని సుఖాన్ని తలచుకొనేవారు కొంతమంది. వర్తమానంలోనే శోధించి సాధించుకోవాలని భావించేవారు ఇంకొంతమంది. భవిష్యత్తుపైనే దృష్టి సారించి- వూహల ప్రపంచంలో, కలల పల్లకిలో విహరిస్తూ ఆనందాన్ని అన్వేషించేవారు మరికొంతమంది ఉంటారు.

ఆనందం కాని, ఆందోళన కాని కేవలం బాహ్య విషయాల వల్ల కలిగేవి కావు. సుఖదుఃఖాలకు మూలం మనిషిలోని అంతరింద్రియమైన మనసు. దాని ఆనందం కేవలం జరిగిన, జరుగుతున్న, జరగనున్న వాటిపైనే ఆధారపడి ఉండదు. అది- మనో నియంత్రణ, సుఖదుఃఖాల తత్వం గ్రహించటం, మనసును బంధించే కామ మోహాల్ని సడలించుకోవడం పైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది.

బందీ కానివాడి సహజ స్థితి- స్వేచ్ఛ. దుఃఖం కలిగించే కారణాల్ని దూరంగా ఉంచితే, మనిషికి నిరంతర ఆనందం స్వాధీనమైనట్లే! కలిగిన, కలుగుతున్న, కలగనున్న అనుభవాల్ని తామరాకు మీద నీటిబొట్టులా అతడు స్వీకరిస్తుండటమే నిత్యానంద స్థితి!

గతానుభవాలు నేర్పిన పాఠాల్ని మనిషి మరవకూడదు. మధుర స్వప్నంలా గోచరించే భవిష్యత్తుకు ప్రణాళికాబద్ధమైన బాట వేసుకోవాలి. వర్తమానాన్ని ధర్మబద్ధతతో పాటు కార్యాచరణ ఉత్సాహంతో స్వీకరించాలి. అప్పుడు అతడికి త్రికాలాలూ ఆనందదాయకాలే!

– మల్లాది హనుమంతరావు

జీవన శైలి

100217anta1a.jpg

హాభారతంలోని ‘ఉద్యోగ పర్వం’లో ఒక ఘట్టం, మనిషి భావహీనతకు అద్దం పడుతుంది. సభాపర్వంలో భంగపడిన పాండవులు- జూద నియమాన్ని అనుసరించి పన్నెండేళ్లు వనవాసం, ఒక సంవత్సరం అజ్ఞాత వాసం పూర్తిచేస్తారు. ఒప్పందం ప్రకారం తమ రాజ్యభాగాన్ని అప్పగించాలని ధృతరాష్ట్రుడికి వర్తమానం పంపుతారు. కాదంటే యుద్ధం తప్పదన్న భావాన్ని వ్యక్తపరుస్తారు. ఒకవైపు కన్నకొడుకులపై అంతులేని అనురాగం, మరోవైపు పలు ఒత్తిళ్ల కారణంగా ఆయన దిక్కుతోచని స్థితికి లోనవుతాడు. తనకు ఇష్టుడు, రథ సారథి అయిన సంజయుణ్ని పాండవుల వద్దకు రాయబారిగా పంపుతాడు. ఆ రాయబారం విఫలమవుతుంది. పాండవుల న్యాయమైన కోరిక కంటే, కొడుకులపై మమకారమే ధృతరాష్ట్రుడిలో ఎక్కువవుతుంది. కుటుంబ కలహాలు ఏ పరిణామాలకు దారితీస్తాయోనన్న ఆందోళన వల్ల, ఆ రాత్రి నిద్ర పట్టదు. మనశ్శాంతి కలిగించే మాటలు వింటూ నిద్రపోవాలనుకొని మహామంత్రి విదురుడికి కబురు చేస్తాడు. నిరహంకారి, నిశ్చల మనస్కుడైన విదురుడు ఆయనతో మాట్లాడిన తీరు, ప్రతి మానవుడూ పాటించాల్సిన సామాజిక నీతిని ప్రస్ఫుటం చేస్తుంది.

‘రాచరికపు భోగాలన్నీ మీ గదిలోనే ఉన్నాయి. అయినా నిద్ర రావడం లేదంటే, భిన్నమైన ఆలోచనలు మిమ్మల్ని చుట్టుముట్టి ఉంటాయి. బలవంతులతో విరోధం తెచ్చుకొన్నవాళ్లకు, ఇతరుల సంపదను మోసంతో హరించినవాళ్లకు, దొంగలకు రాత్రిళ్లు నిద్ర పట్టదు. మరి మీకెందుకు నిద్రపట్టడం లేదు’ అని మహారాజును ప్రశ్నిస్తాడు విదురుడు. ఆ తరవాత ఏం జరిగిందన్నది వేరే కథ!

ఉదాత్త ఆశయాల వల్ల మనిషికి సమాజంలో విలువ పెరుగుతుంది. మనసును ఎప్పుడూ స్వాధీనంలో ఉంచుకొన్నవాడే విద్వాంసుడని పెద్దల మాట. పొగిడితే ఆనందం, విమర్శిస్తే కోపగించుకోవడం వివేకుల లక్షణాలు కావు. ఇతరుల తప్పులనే వెతికేవాడు, అకారణంగా ఆవేశపడేవాడు సాధించగలిగేది ఏదీ ఉండదు.

ఇతిహాసాలు, పురాణాల్లో- భౌతిక సుఖాల కోసం తాపత్రయపడిన వ్యక్తులు కనిపిస్తారు. విశ్వామిత్రుడు నందిని అనే కామధేనువు కోసంబ్రహ్మర్షి వసిష్ఠుడితో యుద్ధానికి సిద్ధపడతాడు. ఓటమి పాలవుతాడు. రజోతత్వం గల విశ్వామిత్రుడు ఆ యుద్ధం వల్ల నేర్చుకొన్న గుణపాఠమేమిటి? సాత్వికత్వంతో బ్రహ్మర్షి స్థాయినైనా పొందవచ్చని! ఆ తరవాత విశ్వామిత్రుడు రాచరికపు లక్షణాల్ని వీడి, వనాలకు వెళ్తాడు. తపస్సుతో అంచెలంచెలుగా ఎదుగుతూ లక్ష్యాన్ని సాధిస్తాడు. అందుకే మనిషి అపజయాల నుంచీ స్ఫూర్తిని పొందవచ్చని చెబుతారు విజ్ఞులు.

జ్ఞానానికి, జీవన విధానానికి సారూప్యం లేకుండా జీవిస్తుంటారు కొందరు. తెలిసి తెలిసీ మూర్ఖుల్లా జీవించేవాళ్లు మరికొందరుంటారు. తమను తామే అదేపనిగా పొగుడుకుంటూ ఉంటారు. మరి కొంతమంది మాట తీరుకు, చేతలకు ఎక్కడా పొంతన ఉండదు.

గొప్ప కార్యాలు సాధించినవారి జీవనశైలిని గమనిస్తే, వారు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని స్పష్టమవుతుంది. వాటిని ఎలా అధిగమించారో పరిశీలిస్తే, ఆశ్చర్యమూ కలుగుతుంది. సహనమే అటువంటి సమర్థుల సహజ లక్షణం. క్షమించగలిగేవారికే స్నేహితులెక్కువ!

సామాజిక నీతికి అనుగుణంగా జీవించేవాడినే అందరూ గౌరవిస్తారు. ఉత్తమ జీవనశైలిని తెలుసుకోవడానికి, అటువంటివారితో సాన్నిహిత్యం అత్యవసరం. వారి జీవన విధానమే ఇతరులందరికీ స్ఫూర్తి! మహాభారతంలో ధర్మరాజు, విదురుడు, అక్రూరుడు అజాత శత్రువులు.

చెడు కలిగించే మిత్రుడి కంటే, గుణవంతుడైన శత్రువే మార్గదర్శకుడని పెద్దలంటారు. దండ కట్టేవాడు పూలను జాగ్రత్తగా పేరుస్తాడు. అటువంటి ఒద్దికైన క్రమ జీవన శైలే మనిషిని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది!

– అప్పరుసు రమాకాంతరావు