kopam

కోపాన్ని జయిద్దాం!
‘తన కోపమె తన శత్రువు’ అంటాడు సుమతీ శతకకారుడు. ఆ శత్రువును జయించడం మాటలతో అయ్యే పని కాదు. మనిషి కోపం ఎదుటివారికి ఎంత బుద్ధి చెబుతుందో తెలియదు కాని, కోపగించిన వ్యక్తికే అది ఎంతో హాని చేస్తుంది. ముందుగా అతడి మనశ్శాంతి పోతుంది. నోరు చేదవుతుంది. గొంతు ఎండిపోతుంది.

‘ఆ క్షణంలో కోపంతో నాకు ఒళ్లు తెలియలేదు’ అని ఆ తరవాత ఆత్మీయులకు చెప్పి కొందరు పశ్చాత్తాపపడతారు. ఆ ఒకే ఒక్క క్షణం వారు నిదానించి ఉంటే, బాధపడే అవసరమే కలిగేది కాదు. సంకల్ప బలం ఉన్నవారికే అటువంటి సంయమనం ఉంటుంది.

‘కోపం రజో గుణ ప్రభావితం’ అంటుంది భగవద్గీత. కామం, క్రోధం అనేవి రజో గుణం నుంచి పుట్టిన మొలకలు. కోరికను, కోపాన్ని నిర్మూలించడం క్షణాల్లో జరిగే పని కాదు. ఈ ప్రపంచంలో కోరికలు లేనివాడంటూ ఉండడు. వాటి వెన్నంటే కోపమూ ఉంటుంది. భయం, కోరిక, కోపం, ఉద్రేకం… ఇవన్నీ మనోభావాలే! ఈ అన్నింటినీ మనిషి పూర్తిగా జయించలేకపోవచ్చు. అభ్యాస బలంతో నియంత్రించుకోవడం మాత్రం అతడి చేతుల్లోనే ఉంది.

ఒక్కోసారి క్రోధం రక్షణకు ఉపకరిస్తుంది. అధర్మాన్ని ఎదుర్కొనేందుకు అది అవసరమవుతుంది. కోపం లేనిదే, అది రానిదే అర్జునుడు యుద్ధభూమిలో విజయం సాధించగలిగేవాడు కాదు.

శ్రీరాముడి గురించి చెబుతూ ‘జిత క్రోధః’ అంటాడు వాల్మీకి. అంటే, రాముడు కోపాన్ని జయించినవాడని అర్థం. లంకా నగరం చేరేందుకు దారి ఇవ్వని సముద్రుడి మీద ఆయన కోపగించాడు. రణరంగంలో రావణుడిపై ఆగ్రహం ప్రదర్శించాడు. అవతార పురుషులు కోపాన్ని ఒక ఆయుధంగా ఉపయోగించడం ద్వారా ధర్మప్రతిష్ఠ చేస్తారనేందుకు ఇవన్నీ ఉదాహరణలు. మహాభారతం ధర్మరాజును కోప రహితుడిగా వర్ణించింది. ‘అలుగుటయే ఎరుంగని మహా మహితాత్ముడు అజాత శత్రుడే అలిగిననాడు…’ అని దుర్యోధనుణ్ని శ్రీకృష్ణుడు ముందుగానే హెచ్చరిస్తాడు.

ప్రేమ, దయ, ఆదరాలతో మనిషి ఈ లోకంలో ఏదైనా సాధించగలడు. ద్వేషం, క్రోధం వల్ల గెలుపు ఎన్నడూ సాధ్యం కాదు. సమయ సందర్భాల్ని బట్టి కోపం అభినయించవచ్చు కాని, బలప్రయోగం తగదు.

ఆధ్యాత్మిక రంగంలో సాధకుడికి క్రోధం ప్రథమ శత్రువు. ‘జీవితంలో కామక్రోధాల తీవ్రతను అదుపుచేసినవాడే సుఖపడతాడు’ అంటాడు గీతాచార్యుడు. జితక్రోధుడి (క్రోధాన్ని జయించినవాడి)కి స్నేహితులు ఎక్కువమంది ఉంటారు. కోపిష్టి మనిషికి శత్రువులు ఎక్కువ. కుటుంబసభ్యులు సైతం అటువంటివారికి దూరమవుతారు.

విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావాలని కాంక్షించి తపస్సు చేశాడు. అనంతరం ఆయన సాధనా బలంతో రాజర్షి కాగలిగినా, క్రోధం ఎదుట ఓడిపోయాడు. తన తపశ్శక్తిని వృథా చేసుకున్నాడు. అనేక సంవత్సరాలు తపస్సు చేస్తే కాని, బ్రహ్మర్షి కాలేకపోయాడు. దీన్నిబట్టి, కామం కంటే క్రోధం బలమైన శత్రువని స్పష్టమవుతుంది.

అభ్యాసంతో క్రోధాన్ని జయించవచ్చు. సాత్వికాహారం తీసుకుంటూ, భగవత్‌ ధ్యానం చేస్తూ, ధర్మగ్రంథాల అధ్యయనం సాగిస్తూ ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. క్రోధం అదుపులోకి వస్తుంది. అలా అని ఆ తరవాత ఎన్నడూ కోపం రాదని చెప్పలేం. ఇంకొకరి కోపాన్ని భరించగలిగితే, మనమూ క్రోధాన్ని జయించినవాళ్లమవుతాం. ఉద్వేగం తగ్గాక, అవతలి వ్యక్తి తన తప్పు తాను తెలుసుకుంటాడు. ధర్మజుడు ఈ దివ్యగుణాన్ని కనబరచాడు.

అజ్ఞాతవాసంలో ఉండగా, కంకుభట్టు రూపంలో ధర్మజుడు పాచికలాడాడు. విరాటరాజు ఓటమి భరించలేక క్రోధం తెచ్చుకున్నాడు. పాచికల్ని విసిరికొట్టి రక్తం చిందేలా చేసినా, తొణకని ధీశాలి ధర్మరాజు. సహనమే అస్త్రంగా ధరించిన ఆయన, అజ్ఞాతవాస నియమానికి భంగం కలగకుండా పాండవుల్ని కాపాడగలిగాడు. క్షమ అనే కవచం ధరించిన సహనశీలిగా ధర్మరాజు వెలుగొందాడు. క్రోధం అనే శత్రువును జయించగలిగాడు!

– తటవర్తి రామచంద్రరావు
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.