క్రియా యోగి
హృదయం- అనే పదంలో ‘దయ’ అనే జీవ లక్షణం నిక్షిప్తమైనట్లు, కర్మయోగుల జీవన సరళిలోనే వారి జీవిత సందేశం ఇమిడి ఉంటుంది. క్రియా యోగంలో ఆరితేరిన పరమహంస యోగానంద జీవన శైలిని పరిశీలిస్తే- అది క్రియాయోగ సారాంశంగా తోస్తుంది.
‘ఈ లోకంలో యోగానంద ఉనికి- చిమ్మచీకట్లో ఉజ్జ్వలంగా వెలిగే జ్యోతి వంటిది. ఆయన వంటి మహానుభావులు చాలా అరుదుగా అవతరిస్తారు… మనుషులకు వారి అవసరం నిజంగా ఉన్నప్పుడు!’ అని జగద్గురువు కంచి కామకోటి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి అన్నారు. అలా లోకానికి అవసరమైనప్పుడు దిగివచ్చేవారినే లోకం కారణజన్ములుగా పరిగణిస్తుంది.
1952 మార్చి ఏడో తేదీన మహాసమాధి చెందిన యోగానంద జీవిత గాథ- ‘ఒక యోగి ఆత్మకథ’! అది ఆధునిక యుగంలో ఆధ్యాత్మిక విప్లవానికి నాంది పలికిన గ్రంథంగా గుర్తింపు పొందింది. ఇరవయ్యో శతాబ్దానికిగాను ప్రపంచ స్థాయిలోని వంద అగ్రశ్రేణి ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఒకటిగా ఎంపికైంది. ఆ గ్రంథం 32 విదేశీ భాషల్లోకి, తొమ్మిది దేశభాషల్లోకి తర్జుమా అయింది.
‘నేను మారలేను…’ అని ఎందుకు అనుకుంటావు? దుర్బలత్వానికి మూలకారణం- మనసులోని సోమరితనం! మానసిక సోమరి దేనికీ పనికిరాడు. విజేత కావాలనే బలమైన కోరిక, ఆ దిశగా గట్టి ప్రయత్నాలు సాగించాలన్న దీక్ష- రెండూ మానసిక సోమరితనం కారణంగానే నశిస్తున్నాయి’ అంటారు యోగానంద. ఆధునిక కోణం నుంచి విశ్లేషించినప్పుడు- ఆయన పలుకులు వ్యక్తిత్వ వికాస నైపుణ్యానికి దోహదకారులు. ఆధ్యాత్మిక కోణంలో అధ్యయనం చేస్తే ‘మనిషి తన నుంచి తనను రక్షించుకోవాలి’ వంటి లోతైన భావాలకు అవి వ్యాఖ్యానాలు!
‘ఒక యోగి ఆత్మకథ’లో యోగానంద జీవితానుభవాల్ని అనుశీలిస్తుంటే- నైమిశారణ్యాల్లో గంధ మాదన గిరుల పరిసరాల్లో విహరిస్తున్నట్లు ఉంటుంది. హిమాలయ పర్వత సానువుల్లోనో పుణ్య భాగీరథీ తీరాల్లోనో ముందుకు సాగుతూ… భారతీయ ఆత్మ సుగంధ పరిమళాల్ని తనివితీరా ఆస్వాదిస్తున్న అనుభూతి కలుగుతుంది. దట్టమైన తులసీ బృందావనంలో సేద తీరినట్లు… ఆ ఔషధుల మీదుగా వీచే చిక్కని ప్రాణవాయువును గుండెల నిండా హాయిగా పీల్చుకున్నట్లు అనిపిస్తుంది. ఆ కథలోని విశేషాలు- ఆధి దైవిక, ఆధి భౌతిక, ఆధ్యాత్మిక పరితాప నిర్మూలన సామర్థ్యంతో మనల్ని హత్తుకుంటాయి. హిమాలయ యోగుల సత్ సంప్రదాయంలో సుశిక్షితుడైన ఒక క్రియా యోగి ధ్యానసాధనతో ఆత్మ సాక్షాత్కారం సాధించిన క్రమం అది. దాన్ని వివరించడం ద్వారా ఆ గ్రంథం మన అంతస్సీమలను జ్యోతిర్మయం చేస్తుంది.
ఈ శతాబ్దంలో విశ్వ నాగరికత విశేష వేగంతో విస్తరిస్తోంది. మనిషిలో అంతర్గతంగా దాగి ఉన్న శక్తియుక్తులు బయటకు ఉబికి వచ్చి- ఈ యుగ అవసరాల్ని, ఆకాంక్షల్ని నెరవేర్చాల్సి ఉంది. ఒక వినూత్న దర్శనాన్ని అవి సాధించాల్సి ఉంది. ఈ దశలో మరిన్ని సందేహాలు, సరికొత్త ప్రశ్నలతో మార్గాన్ని సంక్లిష్టం చేసేవి కాకుండా- స్పష్టమైన సమాధానాలు అందజేస్తూ మనసును తేటపరచగల బోధనలు జాతికి ఎంతో అవసరం. అటువంటివాటి కోసమే మనం యోగానంద పలుకుల్ని ఆకళించుకోవాలి. క్రియాయోగ కళను ఇంకించుకోవాలి. క్రియాయోగ దీక్షను స్వీకరించిన మహాత్మాగాంధీ ‘మనిషి అత్యున్నత చేతనను అది స్పృశిస్తుంది’ అని ప్రకటించారు.
నవీన నాగరికత తీరు ఒకవైపు వివిధ రంగాల విలువల్ని నిర్మూలిస్తూ పోతోంది. మరో వైపు నుంచి భారతీయ సాధువుల అమృత నీతి వచనాలు వాటికి జీవం పోస్తూ వస్తున్నాయి. వాటి ప్రతిధ్వనులే మనకు ఒక యోగి ఆత్మకథ వంటి ఆధ్యాత్మిక గ్రంథాల్లో వినిపిస్తాయి. అంతర్గత అయోమయాల నుంచి బయట పడేస్తాయి. బాహ్య ప్రపంచ గందరగోళం నుంచి, సంక్లిష్టత నుంచి మనిషి తేరుకునేందుకు అవే పెద్ద దిక్కు!