Ninna Nedu Repu

నిన్న-నేడు-రేపు

‘గడిచిన కాలం గురించి ఆలోచన అనవసరం’ అంటారు కొందరు. ‘సంతోషమో, విచారమో- ఆ గతానుభవం తిరిగిరాదు’ అంటారు మరికొందరు. భవిష్యత్తు అనేది ప్రస్తుతానికి వూహలోనే నిలిచి ఉంది. వూహలో మాత్రమే ఉంది. అన్నీ నిజమైన సుఖదుఃఖాల్ని కలిగించలేవు. అవి వస్తాయో రావో, వస్తే ఏ రూపంలో ఎలా ఉంటాయో ఎవరికీ తెలియదు. తెలియనివాటి గురించి సంబరపడటం లేదా కుంగిపోవడం సబబు కాదు. మనిషి యథార్థంగా పొందగలిగేది వర్తమాన క్షణంలో అనుభవానికి వచ్చే సుఖదుఃఖాలనే! మిగిలిన అనుభవాలన్నీ ‘అప్రస్తుతాలు’ అని పెద్దలు చెబుతారు.

వర్తమానంలో ఎదురైన దుఃఖాల నివృత్తి పైనే మనిషి దృష్టి కేంద్రీకరించాలి. ప్రస్తుతాన్ని ఉపేక్షించి, అప్రస్తుత విషయాలమీద విలువైన కాలాన్ని వెచ్చించడం వివేకం కాదు.

సుఖానుభవమంతా గతంలోనే ఉందని కొంతమంది భావిస్తారు. ఆ పాత అనుభవాల మననంతోనే కాలం గడుపుతారు. వారి దృష్టిలో- జీవితంలో రసం, సారం అంటూ ఏదైనా ఉంటే, అది గతంలో కలిగిన మధురానుభవాల నెమరువేతలోనే! వయసు పెరిగి అనారోగ్యం, వృద్ధాప్యం వంటి అనివార్యమైన వాటిని వర్తమానంలో ఎదుర్కొంటున్నవారి పరిస్థితి అది. ప్రస్తుత వాస్తవాల కంటే గతకాలపు జ్ఞాపకాలే వారికి ఎక్కువ సుఖదాయకంగా ఉంటాయి.

మారుతున్న విలువలతో సంఘర్షణ లేకుండా సాగిపోవడం అంత సులభమేమీ కాదు. లౌకిక సంబంధ బాంధవ్యాల నిర్వహణలో అలసినవారికి సమాజపు కొత్త విలువలతో సమాధానపడేందుకు ఓపిక చాలదు. ఆ దశలో వారికి ‘గత కాలము మేలు, వచ్చు కాలము కంటెన్‌’ అనిపించడం ఆశ్చర్యం కాదు. గత కాలపు సంగతుల మేలు తలచుకోవడంలోనే వారికి కాలం గడుస్తుంది.

ఎంత కష్టమైనా సుఖమైనా- ఒకసారి అనుభవానికి వచ్చిన తరవాత అది చెరకు పిప్పి వంటిదని కొందరంటారు. కాల్చేసిన టపాకాయలో, వెలిగి ఆరిన చిచ్చుబుడ్డిలో ఇక ఏదీ ఉండదని వారి అభిప్రాయం. గతాన్ని తలచుకోవడమే వ్యర్థం జీవితం అంటే; కొత్త బంగారు లోకమేనని, సుఖం కలిగించేలా భవిష్యత్తులో అనేకం తమకు కలగనున్నాయని వారు తలుస్తారు. ఆశగా ఎదురుచూస్తుంటారు. వారిలో ఎప్పుడూ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి గురించిన మధురమైన వూహలే నెలకొంటాయి.

భవిష్యత్తులో దుఃఖం తప్పదని సదా శంకించేవారికి ఆపదలు, అనర్థాలే కనిపిస్తుంటాయి. జరిగిన, జరుగుతున్న వాటి కంటే, జరగనున్నవే తమకు ఎక్కువ సుఖానుభూతి కలిగిస్తాయని వారు నమ్ముతుంటారు.

గతంలోని సుఖాన్ని తలచుకొనేవారు కొంతమంది. వర్తమానంలోనే శోధించి సాధించుకోవాలని భావించేవారు ఇంకొంతమంది. భవిష్యత్తుపైనే దృష్టి సారించి- వూహల ప్రపంచంలో, కలల పల్లకిలో విహరిస్తూ ఆనందాన్ని అన్వేషించేవారు మరికొంతమంది ఉంటారు.

ఆనందం కాని, ఆందోళన కాని కేవలం బాహ్య విషయాల వల్ల కలిగేవి కావు. సుఖదుఃఖాలకు మూలం మనిషిలోని అంతరింద్రియమైన మనసు. దాని ఆనందం కేవలం జరిగిన, జరుగుతున్న, జరగనున్న వాటిపైనే ఆధారపడి ఉండదు. అది- మనో నియంత్రణ, సుఖదుఃఖాల తత్వం గ్రహించటం, మనసును బంధించే కామ మోహాల్ని సడలించుకోవడం పైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది.

బందీ కానివాడి సహజ స్థితి- స్వేచ్ఛ. దుఃఖం కలిగించే కారణాల్ని దూరంగా ఉంచితే, మనిషికి నిరంతర ఆనందం స్వాధీనమైనట్లే! కలిగిన, కలుగుతున్న, కలగనున్న అనుభవాల్ని తామరాకు మీద నీటిబొట్టులా అతడు స్వీకరిస్తుండటమే నిత్యానంద స్థితి!

గతానుభవాలు నేర్పిన పాఠాల్ని మనిషి మరవకూడదు. మధుర స్వప్నంలా గోచరించే భవిష్యత్తుకు ప్రణాళికాబద్ధమైన బాట వేసుకోవాలి. వర్తమానాన్ని ధర్మబద్ధతతో పాటు కార్యాచరణ ఉత్సాహంతో స్వీకరించాలి. అప్పుడు అతడికి త్రికాలాలూ ఆనందదాయకాలే!

– మల్లాది హనుమంతరావు
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.