మహాభారతంలోని ‘ఉద్యోగ పర్వం’లో ఒక ఘట్టం, మనిషి భావహీనతకు అద్దం పడుతుంది. సభాపర్వంలో భంగపడిన పాండవులు- జూద నియమాన్ని అనుసరించి పన్నెండేళ్లు వనవాసం, ఒక సంవత్సరం అజ్ఞాత వాసం పూర్తిచేస్తారు. ఒప్పందం ప్రకారం తమ రాజ్యభాగాన్ని అప్పగించాలని ధృతరాష్ట్రుడికి వర్తమానం పంపుతారు. కాదంటే యుద్ధం తప్పదన్న భావాన్ని వ్యక్తపరుస్తారు. ఒకవైపు కన్నకొడుకులపై అంతులేని అనురాగం, మరోవైపు పలు ఒత్తిళ్ల కారణంగా ఆయన దిక్కుతోచని స్థితికి లోనవుతాడు. తనకు ఇష్టుడు, రథ సారథి అయిన సంజయుణ్ని పాండవుల వద్దకు రాయబారిగా పంపుతాడు. ఆ రాయబారం విఫలమవుతుంది. పాండవుల న్యాయమైన కోరిక కంటే, కొడుకులపై మమకారమే ధృతరాష్ట్రుడిలో ఎక్కువవుతుంది. కుటుంబ కలహాలు ఏ పరిణామాలకు దారితీస్తాయోనన్న ఆందోళన వల్ల, ఆ రాత్రి నిద్ర పట్టదు. మనశ్శాంతి కలిగించే మాటలు వింటూ నిద్రపోవాలనుకొని మహామంత్రి విదురుడికి కబురు చేస్తాడు. నిరహంకారి, నిశ్చల మనస్కుడైన విదురుడు ఆయనతో మాట్లాడిన తీరు, ప్రతి మానవుడూ పాటించాల్సిన సామాజిక నీతిని ప్రస్ఫుటం చేస్తుంది.
‘రాచరికపు భోగాలన్నీ మీ గదిలోనే ఉన్నాయి. అయినా నిద్ర రావడం లేదంటే, భిన్నమైన ఆలోచనలు మిమ్మల్ని చుట్టుముట్టి ఉంటాయి. బలవంతులతో విరోధం తెచ్చుకొన్నవాళ్లకు, ఇతరుల సంపదను మోసంతో హరించినవాళ్లకు, దొంగలకు రాత్రిళ్లు నిద్ర పట్టదు. మరి మీకెందుకు నిద్రపట్టడం లేదు’ అని మహారాజును ప్రశ్నిస్తాడు విదురుడు. ఆ తరవాత ఏం జరిగిందన్నది వేరే కథ!
ఉదాత్త ఆశయాల వల్ల మనిషికి సమాజంలో విలువ పెరుగుతుంది. మనసును ఎప్పుడూ స్వాధీనంలో ఉంచుకొన్నవాడే విద్వాంసుడని పెద్దల మాట. పొగిడితే ఆనందం, విమర్శిస్తే కోపగించుకోవడం వివేకుల లక్షణాలు కావు. ఇతరుల తప్పులనే వెతికేవాడు, అకారణంగా ఆవేశపడేవాడు సాధించగలిగేది ఏదీ ఉండదు.
ఇతిహాసాలు, పురాణాల్లో- భౌతిక సుఖాల కోసం తాపత్రయపడిన వ్యక్తులు కనిపిస్తారు. విశ్వామిత్రుడు నందిని అనే కామధేనువు కోసంబ్రహ్మర్షి వసిష్ఠుడితో యుద్ధానికి సిద్ధపడతాడు. ఓటమి పాలవుతాడు. రజోతత్వం గల విశ్వామిత్రుడు ఆ యుద్ధం వల్ల నేర్చుకొన్న గుణపాఠమేమిటి? సాత్వికత్వంతో బ్రహ్మర్షి స్థాయినైనా పొందవచ్చని! ఆ తరవాత విశ్వామిత్రుడు రాచరికపు లక్షణాల్ని వీడి, వనాలకు వెళ్తాడు. తపస్సుతో అంచెలంచెలుగా ఎదుగుతూ లక్ష్యాన్ని సాధిస్తాడు. అందుకే మనిషి అపజయాల నుంచీ స్ఫూర్తిని పొందవచ్చని చెబుతారు విజ్ఞులు.
జ్ఞానానికి, జీవన విధానానికి సారూప్యం లేకుండా జీవిస్తుంటారు కొందరు. తెలిసి తెలిసీ మూర్ఖుల్లా జీవించేవాళ్లు మరికొందరుంటారు. తమను తామే అదేపనిగా పొగుడుకుంటూ ఉంటారు. మరి కొంతమంది మాట తీరుకు, చేతలకు ఎక్కడా పొంతన ఉండదు.
గొప్ప కార్యాలు సాధించినవారి జీవనశైలిని గమనిస్తే, వారు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని స్పష్టమవుతుంది. వాటిని ఎలా అధిగమించారో పరిశీలిస్తే, ఆశ్చర్యమూ కలుగుతుంది. సహనమే అటువంటి సమర్థుల సహజ లక్షణం. క్షమించగలిగేవారికే స్నేహితులెక్కువ!
సామాజిక నీతికి అనుగుణంగా జీవించేవాడినే అందరూ గౌరవిస్తారు. ఉత్తమ జీవనశైలిని తెలుసుకోవడానికి, అటువంటివారితో సాన్నిహిత్యం అత్యవసరం. వారి జీవన విధానమే ఇతరులందరికీ స్ఫూర్తి! మహాభారతంలో ధర్మరాజు, విదురుడు, అక్రూరుడు అజాత శత్రువులు.
చెడు కలిగించే మిత్రుడి కంటే, గుణవంతుడైన శత్రువే మార్గదర్శకుడని పెద్దలంటారు. దండ కట్టేవాడు పూలను జాగ్రత్తగా పేరుస్తాడు. అటువంటి ఒద్దికైన క్రమ జీవన శైలే మనిషిని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది!